కలగానే కనిగిరి నిమ్జ్‌ - Prajasakti (original) (raw)

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : కనిగిరి నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌) కలగానే మిగిలింది. పరిశ్రమల కోసం సేకరించిన భూమి ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తోంది. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును ప్రకటించారు. ఆ తర్వాత కేంద్రంలో వరుసగా మూడు దఫాలు అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం దీన్ని అటకెక్కించింది. ఈ ప్రాంత ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ అభ్యర్థీ తన మేనిఫెస్టోలో కనిగిరి నిమ్జ్‌ను పెట్టుకోవడం, గెలిచాక దాన్ని పట్టించుకోకపోవడం పరిపాటైంది. అప్పట్లో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కృషి ఫలితంగా ఇక్కడ నిమ్జ్‌ ఏర్పాటుకు యుపిఎ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ తర్వాత కేంద్రంలో అధికార మార్పిడి జరగడంతో యుపిఎ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రకటించిందనే నెపంతో ఎన్‌డిఎ ప్రభుత్వం దీన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది.

14,231 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళిక

కనిగిరి నియోజకవర్గం అన్ని రకాలుగా వెనుకబడి ఉంది. ఉపాధి కోసం ఈ ప్రాంతం నుంచి వలసపోతున్నారు. ఫ్లోరిన్‌ పీడిత ప్రాంతం కావడంతో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ పారిశ్రామిక ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుతో ఉపాధి పెంచాలనే నిర్ణయాన్ని అప్పట్లో యుపిఎ ప్రభుత్వం పీసీపల్లి, పామూరు మండలాల్లో 14,231 ఎకరాల్లో నిమ్జ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ.43,700 కోట్ల పెట్టుబడులు ఇక్కడ పెట్టేలా ప్రణాళిక రూపొందించారు. ప్రత్యక్షంగా, పరోక్షం 2.5 లక్షల మందికి ఉపాధి కల్పన చేయవచ్చని అంచనా వేశారు. రూ.24 వేల కోట్ల విలువైన ఉత్పత్తులను ఇక్కడ నుంచి రామాయపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు చేయవచ్చని భావించారు. భూసేకరణ జరిగినా ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కానందున లక్ష్యాలు కాగితాలకే పరిమితమయ్యాయి.

పీసీపల్లిలో వెయ్యి ఎకరాల్లో ప్లాట్లు, రహదారులు

పీసీపల్లి మండలంలో కందుకూరు-పామూరు రహదారిలో మాలకొండ సమీపంలో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎపిఐఐసి ప్లాట్లు, తారురోడ్లు వేసింది. రబ్బరు, ఆటోమొబైల్‌, స్థానికంగా ఉండే ఖనిజాల ఆధారంగా పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొస్తే భూములు ఇవ్వడానికి సిద్ధమైంది. అనుకూలమైన రవాణా వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉంది. పోర్టుకు వెళ్లేందుకు రోడ్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో పరిశ్రమలు రాలేదు.

ఇటీవల ఎన్నికల్లోనూ చంద్రబాబు హామీ

గతేడాది జరిగిన ఎన్నికల్లో కనిగిరి నిమ్జ్‌పై టిడిపి, వైసిపి హామీలు ఇచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కనిగిరి సభలో నిమ్జ్‌ను చేపడతామని ప్రకటించారు. గతంలో ఈ పరిశ్రమ కోసం కృషి చేసిన ఉగ్రనరసింహారెడ్డి ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నిమ్జ్‌ను ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇక్కడ పరిశ్రమల ఏర్నాటుకు కృషి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ పరిశ్రమలు వస్తే తమకు ఉపాధి లభిస్తుందనే ఆశతో ఆ ప్రాంత యువత ఉంది.