మొదటి పేజీ (original) (raw)

బ్రూస్ లీ (నవంబర్ 27, 1940 - జులై 20, 1973) అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన మార్షల్ ఆర్టిస్ట్ (యుద్ధ క్రీడా నిపుణుడు), నటుడు, నిర్మాత, తత్వవేత్త. ఇతను తాను ఆచరించిన నిరాయుధ పోరాటం, ఆత్మరక్షణ పద్ధతులు, జెన్ బౌద్ధం, టావోయిజం లాంటి అనేక సాంప్రదాయాల మిశ్రమమైన జీత్ కున్ డు అనే ఒక హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ తత్వాన్ని కనిపెట్టాడు. అటు అమెరికా, ఇటు హాంగ్‌కాంగ్ దేశాల సినిమాలలో నటించిన లీ, చైనా ప్రాంతం నుంచి వచ్చిన మొట్టమొదటి గ్లోబల్ స్టార్ అని చెప్పవచ్చు. ఆయన్ను చాలామంది 20 వ శతాబ్దంలో, సినిమా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన యుద్ధ విద్యా ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు. ఐదు పూర్తి స్థాయి మార్షల్ ఆర్ట్స్ సినిమాలలో నటించిన బ్రూస్ లీ, 1970 వ దశకంలో ఆ శైలి చిత్రాలకు ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యతను కల్పించి హాంగ్‌కాంగ్ యాక్షన్ కథా చిత్రాలకు ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టాడు. అమెరికా, హాంగ్‌కాంగ్ సంయుక్తంగా నిర్మించిన ఎంటర్ ది డ్రాగన్ (1973), ద గేమ్ ఆఫ్ డెత్ (1978) చిత్రాల్లో నటించాడు. హాలీవుడ్, హాంగ్‌కాంగ్ సంయుక్తంగా నిర్మించిన అతని చిత్రాలు వాణిజ్యపరంగా మంచి విజయం సాధించి హాంగ్‌కాంగ్ మార్షల్ ఆర్ట్స్ చిత్రాలను ప్రాచుర్యంలోనూ, ప్రశంసల్లోనూ మరో మెట్టు ఎక్కించడమే కాక పాశ్చాత్య దేశాలలో చైనీస్ మార్షల్ ఆర్ట్స్ మీద ఆసక్తి కలిగేలా చేశాయి. సినిమాల దర్శకత్వం, వాటిలోని టోన్, పోరాట దృశ్యాల రూపకల్పన, వైవిధ్యం అన్ని వెరసి మార్షల్ ఆర్ట్స్, దానిమీద ఆధారపడిన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 33 సంవత్సరాల వయసులో సెరెబ్రల్ ఎడిమా అనే వ్యాధితో లీ హఠాన్మరణంతో అతని కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. అయినా సరే అతని చిత్రాలు నేటికీ ప్రజాదరణ పొందుతూ ఒక కల్ట్ క్లాసిక్ స్థాయిని సంపాదించుకున్నాయి.
(ఇంకా…)