News in Pics: చిత్రం చెప్పేవిశేషాలు (20-11-2024) (original) (raw)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
Updated : 20 Nov 2024 05:26 IST
1/8
కూడళ్లు కళకళలాడేలా బల్దియా చేపడుతున్న సుందరీకరణ పనులు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన పువ్వు ఆకృతిలోని నమూనా జిగేల్‌మంటూ ఆ ప్రాంతానికి వన్నెతెస్తోంది.
2/8
ఈచిత్రం చూశారా.. ఎంత మనోహరంగా ఉందనుకుంటున్నారు కదూ! నిజమే. పరీక్షగా చూడండి.. చెట్ల ప్రతిబింబాలు నీటిలో ఎలా కనిపిస్తున్నాయో! ఎటు చూసినా ఒకేలా ఉన్నాయి కదూ! ఈదృశ్యం సీతారామపురం నుంచి ఉదయగిరి వెళ్లే మార్గంలో కుర్రపల్లి చెరువు వద్ద మంగళవారం కెమెరాకు చిక్కింది.
3/8
సెల్‌ఫోన్ అతి వినియోగంతో వివిధ రుగ్మతల బారిన పడిన వారికి.. పుస్తక పఠనమే సరైన చికిత్స అంటూ ఈ చిత్రం చెబుతోంది. చరవాణికి బానిసలైన వారికి కనువిప్పు కలిగించేలా అమీర్‌పేటలో ఓ పైవంతెనకు వేసిన ఈ చిత్రం అటుగా వెళ్లే వారిని ఆలోచింపజేస్తోంది.
4/8
ప్రముఖ శైవక్షేతం బాల బ్రహ్మేశ్వర స్వామి సన్నిధిలో మంగళవారం ఆరుద్రోత్సవం వైభవంగా నిర్వహించారు. శివుడిది ఆరుద్రనక్షత్రం కావడంతో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.కార్తిక మాసం కావడంతో స్వామి సన్నిధిలో దీపాలు వెలగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు.
5/8
భీమవరం పట్టణం: జాతీయ సమైక్యతతో దేశ సమగ్రత సాధ్యమవుతుందని సంయుక్త కలెక్టర్ రాహుల్‌కుమార్ రెడ్డి అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా భారతీయ విద్యాభవన్స్ పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
6/8
తీరగ్రామాల్లో కొన్నిచోట్ల ఎటు చూసినా ఇళ్ల చుట్టూ నీరే ఉంటుంది. దీంతో ఇళ్లను ఆనుకుని నిత్యం ప్రవాహమే. ఆటుపోటుల సమయంలో ఇళ్ల వరకు నీరు వస్తుంటుంది. వీటిని చూస్తుంటే నీటిలోనే గృహాలను నిర్మించారా అన్నట్టుగా ఉంటాయి.
7/8
విశాఖపట్నం ఏయూ గ్రంథాలయంలో ఓ భారీ పుస్తకం అందరినీ ఆకర్షిస్తోంది. మిగిలిన వాటికన్నా భిన్నంగా ఉండటంతో ప్రతి ఒక్కరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. అందులో విశేషాలేమిటా అని ఆరా తీస్తున్నారు. నాలుగు వేదాల సారాంశంతో ‘దివ్యవేద వాణి’గా ప్రచురించిన ఈ పుస్తకం దాదాపు ఎనిమిదివేల పేజీలతో ఉంది.
8/8
ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల మధ్య తారాబు జలపాతం ఆహ్లాదంగా దర్శనమిస్తోంది. కొండల మధ్య జాలువారుతున్న నీటి ప్రవాహం పాలనురగను తలపిస్తోంది.