YS Sharmila: కడప స్టీల్‌ప్లాంట్ కోసం ఎంపీ అవినాష్ ఏం చేశారు?: షర్మిల (original) (raw)
పదేళ్లు స్థానిక ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy).. కడప స్టీల్‌ప్లాంట్ కోసం ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు.
Published : 20 Nov 2024 14:12 IST
కడప: పదేళ్లు స్థానిక ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy).. కడప స్టీల్‌ప్లాంట్ కోసం ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. ప్రజలు ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు. గత ఐదేళ్లలో స్టీల్‌ప్లాంట్ కోసం జగన్ చేసిందేమీ లేదన్నారు. కేవలం టెంకాయలు కొట్టే ఫ్యాక్టరీగానే గత పాలకులు తయారు చేశారన్నారు. మీడియా ఎదుట షర్మిల టెంకాయలు కొట్టి నిరసన తెలిపారు.
‘‘కడప స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపనలకే పరిమితమైంది. చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ అన్నట్లుగా తయారైంది. పేద ప్రజల కోసం, కడప ప్రాంత అభివృద్ధి కోసం వైఎస్సార్ చిత్తశుద్ధితో దీన్ని తీసుకొచ్చారు. 10వేల ఎకరాల్లో రూ.20వేల కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలన్నది ఆయన ఆశయం. దీని ద్వారా 25వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశముంది. వైఎస్సార్ చనిపోయిన తర్వాత వచ్చిన నాయకులందరూ స్టీల్ ప్లాంట్ ఊసే లేకుండా చేశారు. సెయిల్ ద్వారానే ప్లాంట్ నిర్మించాలని విభజన హామీల్లో ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే నిర్మాణం జరిగి ఉండేది. ఏపీ పట్ల భాజపాకు చిన్నచూపు ఉంది. ప్రత్యేక హోదాతో పాటు మిగిలిన హామీలను సైతం ఆ పార్టీ తుంగలో తొక్కింది.
జగన్ ఆస్కార్ డైలాగులు చెప్పారు
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని విస్మరించారు. మూడేళ్లలో నిర్మాణం చేపట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని జగన్ నాడు ఆస్కార్ డైలాగులు చెప్పారు. అధికారం, ప్రాంతాలు, కంపెనీలు మారుతున్నా స్టీల్ ప్లాంట్ నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. పదేళ్లు ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంటులో ఏం చేశారో సమాధానం చెప్పాలి. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లని జగన్‌కు ఎమ్మెల్యే పదవి ఎందుకో?ప్రతిపక్ష హోదాకు అవసరమైన ఎమ్మెల్యేలని గెలిపించుకోలేని ఆయన.. ప్రతిపక్ష హోదా కావాలని అడగటం సిగ్గుచేటు. కడప ప్రాంత అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమబాట పడుతుంది. అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షకూ సిద్ధం’’ అని షర్మిల అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.