Indian Railway: సెమీ హైస్పీడ్ కారిడార్.. శరవేగం.. స్టేషన్లు పరిమితం (original) (raw)
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత సెమీ హైస్పీడ్ కారిడార్‌లో రైల్వే స్టేషన్ల సంఖ్య పరిమితంగా ఉండనుంది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కి.మీ.ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
Updated : 17 Nov 2024 09:22 IST
సెమీ హైస్పీడ్ కారిడార్‌లో స్టేషన్ల మధ్య అధిక దూరం
కనీస దూరం 27 కి.మీ... గరిష్ఠంగా 88 కి.మీ.
ప్రాథమిక అంచనా వ్యయం రూ.21 వేల కోట్లు?
ఈనాడు, హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రతిపాదిత సెమీ హైస్పీడ్ కారిడార్‌లో రైల్వే స్టేషన్ల సంఖ్య పరిమితంగా ఉండనుంది. ఈ మార్గంలో రైళ్లు గంటకు 220 కి.మీ.ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఎలైన్‌మెంట్‌ను పరిశీలిస్తే సగటున ప్రతి 49 కి.మీ.లకు ఒక స్టేషన్‌ను మాత్రమే ప్రతిపాదించారు. ఇక్కడ రెండు స్టేషన్ల మధ్య తక్కువ దూరం 27.76 కిమీ. ఇది సూర్యాపేట-నకిరేకల్ మధ్య ఉంటుంది. గరిష్ఠ దూరం తుని-రాజమహేంద్రవరం మధ్య 88 కి.మీ.లు ఉండనుంది. అతి తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యం చేర్చడం లక్ష్యం కావడంతో స్టేషన్ల సంఖ్యను పరిమితం చేసినట్లు సమాచారం. సెమీ హైస్పీడ్‌కారిడార్‌లో శంషాబాద్-విశాఖపట్నం మార్గంలో మొత్తం 12 స్టేషన్లు ప్రతిపాదించగా తెలంగాణలో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో ఆరు ఉన్నాయి. మరోవైపు కర్నూలు-విశాఖపట్నం మార్గాన్ని కర్నూలు నుంచి శంషాబాద్-విశాఖపట్నం మార్గంలో వచ్చే సూర్యాపేట వరకు నిర్మించాలన్నది ప్రణాళిక. ఈ రూట్‌లో వచ్చే ఎనిమిది అదనపు స్టేషన్లలో కర్నూలు మినహా మిగిలిన అన్నీ తెలంగాణలో వస్తాయి.
ఎనిమిదిలో... ఏడు ఇక్కడే
విశాఖపట్నం-శంషాబాద్ సెమీ హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదిత మార్గంలో మరో కీలక అంశం కూడా ఉంది. ఏపీలోని విశాఖపట్నం - కర్నూలు నగరాలను అనుసంధానం చేసే మార్గాన్ని సూర్యాపేట మీదుగా ప్రతిపాదించారు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది అదనపు రైల్వే స్టేషన్లు వస్తుండగా... వాటిలో ఏడు తెలంగాణలో ఉన్నాయి. విశాఖపట్నం-విజయవాడ-శంషాబాద్, విశాఖపట్నం-విజయవాడ-కర్నూలు ప్రాజెక్టుల ప్రాథమిక అంచనా వ్యయం రూ.21 వేల కోట్ల పైచిలుకు ఉంటుందని తెలుస్తోంది. నవంబరులో రైల్వే బోర్డుకు సమర్పించే ప్రిలిమినరీ ఇంజినీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వే నివేదికతో వ్యయంపై స్పష్టతరానుంది. పెట్ సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం లభించాక సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు తుది సర్వే నిర్వహిస్తారు.
వయా... మునుగోడు నియోజకవర్గం
శంషాబాద్-విశాఖపట్నం సెమీ హైస్పీడ్ కారిడార్ ఎలైన్‌మెంట్‌ను పరిశీలిస్తే... విజయవాడ జాతీయ రహదారిలోని ఎల్‌బీనగర్ - చౌటుప్పల్ మార్గంలో కాకుండా శంషాబాద్ నుంచి మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్‌కు వెళుతోంది. జాతీయరహదారిలోని చౌటుప్పల్ నుంచి 24 కిమీ లోపలకు గట్టుప్పల్ ఉంటుంది. చిట్యాల వెస్ట్, నకిరేకల్, సూర్యాపేట జంక్షన్ ప్రతిపాదిత స్టేషన్లూ ఎలైన్‌మెంట్‌లో జాతీయ రహదారికి కొంత దూరంలో ఉంటాయి. సెమీహైస్పీడ్ కారిడార్ ఎలైన్‌మెంట్ జాతీయ రహదారికి దూరంగా ఉండడానికి భూసేకరణ చిక్కులు, భూముల ధరలే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘తెలంగాణ చిన్న రాష్ట్రం. కొత్త ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యగా ఉంది’ అని కేంద్రంలో ఓ కీలక ప్రజాప్రతినిధి ‘ఈనాడు’తో అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.